Thursday, October 28, 2010

హైకూ టెక్నిక్ పట్టుకోవాలి

హైకూ టెక్నిక్ పట్టుకోవాలి
కొందరు మొదటి ప్రయత్నంగా, మరికొందరు రొటీన్ గా హైకూలు రాస్తున్నారు. హైకూను మూడు పాదాలతో రాయాలని,అక్షర నియమమే పాటించాలనుకుంటే ఒకటి,రెండు,మూడు పాదాలలో క్రమంగా 5 -7 -5 అక్షరాలను పాటిస్తూ రాయాలనే కొన్ని హైకూ ప్రధాన లక్షణాలను తెలుసుకొని రాస్తున్నారేగాని తక్కువ అక్షరాలలో ఎక్కువ భావాన్ని చెప్పడానికి హైకూ కవులు పాటించాల్సిన,అనుసరించాల్సిన పద్ధతి గురించి ఆలోచించడం లేదు.
ఇండియన్ హైకూ క్లబ్ 'హైకూ మాసపత్రిక'కు నేను ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రోజుల్లో ఒక హైకూ మిత్రుడు "పాడుబడిన నూతిలో / వణికిపోతూ చందమామ / కప్పల బెకబెకలకు భయపడుతున్నట్లుంది" అని ప్రచురణకోసం ఓ హైకూ రాసి పంపించాడు. నిజానికి ఇంకా తక్కువ అక్షరాలలో దీని భావపరిధిని పెంచుతూ చెప్పవచ్చు. హైకూ ఎక్కువ అక్షరాలను భరించలేదు. సాధ్యమైనంత తక్కువ అక్షరాలతో హైకూను చెప్పగలిగినప్పుడే చదివే వారికి అనుభూతిని అందిస్తుంది.
ఉదాహరణకు "పాడుబడ్డ నుయ్యి / బెకబెక శబ్దానికేనేమో / భయంతో వణుకుతూ జాబిలి"
ఈ హైకూలోని మొదటిపాదంలో ఒక స్థితిని,రెండవ పాదంలో అసంపూర్ణ వాక్యాన్ని,మూడవ పాదంలో ఒక మెరుపులాంటి భావాన్ని ఇలా రాయవచ్చు. ఇలా జాబిలి అనే పదాన్ని ప్రయోగించడం ద్వారా భావ పరిధినికూడా పెంచవచ్చు. పురుషాధిక్య సమాజంలో స్త్రీ పరిస్థితిని తెలియజేసే సామాజిక నేపధ్యంగల హైకూగా కూడా మనం దానిని అర్థం చేసుకోవచ్చు. పాడుబడ్డ నూతి'లో' అని వచనంగా కాక 'పాడుబడ్డ నుయ్యి ' అని నూతి స్థితిని తెలియజేయవచ్చు. బెకబెక అని అరిచేవి కప్పలే గనుక 'కప్పను' ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇలా అవసరం లేని ప్రతిదానిని ఎడిట్ చేసుకుంటూ సంక్షిప్తంగా చెప్పడమే హైకూ టెక్నిక్.